ఓం శ్రీ సాయినాథాయ నమః
సాయి బంధువు బాలకృష్ణ 4 సంవత్సరాల కిందట తమకు బాబా చూపిన లీల ఈ విధంగా పంచుకుంటున్నారు.
“మా నాన్నగారు టైలర్ వృత్తి నిర్వహిస్తారు.ఒక రోజు పని ముగించుకుని ఇంటికి 8 గంటల ప్రాంతంలో వచ్చారు. భోజనం ముగించుకుని నిద్రపోయాడు. కానీ మరునాడు నిద్ర నుండి ఎంతకీ మెల్కొనలేకపోయేసరికి పట్టణంలోనే ఉన్న ఒక హాస్పిటల్ కి తీసుకొని వెల్లాము. డాక్టర్లు పరీక్షించి, కోమాలో వెళ్లిపోయాడని,బ్రతికే అవకాశం లేదని, కావాలంటే గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకు వెళ్ళమని సలహా ఇచ్చారు. అందువల్ల పక్క పట్టణమైన సంగారెడ్డి లోని గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్ళాము. అక్కడ డాక్టర్ సిటీ స్కాన్ చేసి “బ్రెయిన్ లో రక్తం గడ్డ కట్టింది. ఆపరేషన్ చేయాలి, దానికి మూడు లక్షలు ఖర్చవుతుంది. ఆపరేషన్ చేయకపోతే మీ నాన్న గారిని బ్రతికించడం కష్టం” అని కూడా చెప్పారు. కానీ దగ్గర అంత డబ్బు లేదు. చేసేదేమీ లేక చాలా ఆందోళనతో హుటాహుటిన హైదరాబాద్ లోని గాంధీ హాస్పిటల్ కి మా నాన్నగారిని తీసుకు వెళ్ళాము. అక్కడ ఏమన్నా తక్కువ ఖర్చు అవుతుందేమో అని ఆశ లో వున్నాము..
అక్కడ మూడు రోజుల మందుల treatment తో, మా నాన్నగారు కోమా నుండి బయట పడ్డారు. కానీ పిచ్చిపిచ్చిగా ప్రవర్తించ సాగాడు. ఎలాగైనా ఆపరేషన్ చేయాలని లేదంటే చనిపోతాడు . అని డాక్టర్లు చెప్పడంతో, ఏం చేయాలో అర్థం కాలేదు. ఏం చేయాలో అని ఆలోచిస్తూ అలా హాస్పిటల్ బయటికి రాగానే, హాస్పిటల్ ప్రాంగణంలోనే నాకు చిన్న బాబా గుడి కనిపించింది. లోనికి వెళ్లగా బాబా రూపం అభయమిస్తున్నట్లు గా అనిపించింది. వెంటనే మా నాన్నగారిని హాస్పిటల్ బెడ్ పైనుండి మోసుకుని గుడిలోకి తీసుకెళ్ళి కుర్చోపెట్టాను . మా నాన్నగారికి ఆరోగ్యం బాగు చేయమని ప్రార్థించాను. మా దగ్గర ఆపరేషన్ కి డబ్బులు లేక పోవడంతో, డాక్టర్స్ ఇంటికి వెళ్లిపోమ్మని డిశ్చార్జ్ చేశారు. ఇంటికి వెళ్ళాక కొద్దిరోజుల్లో, కొద్దికొద్దిగా మా నాన్నగారి ఆరోగ్యం సాయి దయ వలన మెరుగు అవ సాగింది.
ఇప్పుడు మా నాన్నగారు పూర్తి ఆరోగ్యంతో ఉండి ఇప్పటికీ నా కుటుంబాన్ని పోషిస్తున్నారు.మూడు లక్షలు అవుతుంది అన్న ఖర్చు సాయి అనుగ్రహంతో కేవలం 4వేల లోనే నయం అయిపోయింది.
బాబాకు నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. ఇప్పుడు నాకు ఉన్న కొన్ని ఆర్థిక ఇబ్బందులు కూడా బాబా దయతో త్వరలోనే తగ్గుతాయని ఆశిస్తున్నాను.”
జై సాయి రామ్