ఓం శ్రీ సాయినాధాయ నమః
ప్రేమమూర్తి శ్రీ షిరిడి సాయి ని నాకు పరిచయం చేసిన పూజ్య గురుదేవులు శ్రీ అమ్ముల సాంబశివరావు గారికి నా పాదాభివందనాలు.
మేము 1986 నుండి 89 ప్రాంతంలో మా నాన్నగారి ఉద్యోగరీత్యా నిజామాబాదులో ఉండే వాళ్ళము. కొంతకాలానికి మా ఇంటి పక్క పోర్షన్లో పూజ్య గురుదేవులు శ్రీ అమ్ముల సాంబశివరావు గారు కుటుంబంతో అద్దెకు దిగారు. నేను అప్పుడు సుమారు ఏడు యెనిమిది సంవత్సరాల చిన్న వయసులో ఉన్నందువల్ల నాకు గుర్తు ఉన్న విషయాలను మీతో పంచుకుంటాను.
మేము అద్దెకు ఉంటున్న రెండంతస్తుల బిల్డింగ్ లో సుమారు ఎనిమిది పోర్షన్ లు ఉండేవి . మొదటి అంతస్తులో మేము ఉండే వాళ్లము. మా పోర్షన్ కి గురువుగారి పోర్షన్ కి మధ్యలో బిల్డింగ్ ముందు వైపు నుంచి వెనక భాగానికి వెళ్లడానికి వీలుగా రెండు వైపులా తలుపులు ఉన్న కారిడార్ లాంటి గది ఉండేది. ఆ గదిలోనే గురువుగారు బాబా పటాలను వరుసగా పెట్టి ప్రతిరోజు పూజ 4 హారతులు నిర్వహించేవారు. ప్రతి ఆదివారం సత్సంగము కూడా నిర్వహించేవారు. గురువుగారి అమ్మాయిలు (గురుపుత్రికలు) మా అక్కయ్య ఇలా చిన్న పిల్లలందరికీ అప్పుడప్పుడు బాబా పటాలకి బొట్టు పెట్టే అవకాశం వచ్చేది. సత్సంగం అయ్యాక బిల్డింగ్ లోని అందరికీ బాబా తీర్థం శనగల ప్రసాదం పంచడానికి పోటీపడే వాళ్ళము. గురువుగారు పెద్దవాళ్ళు అందరిని కూర్చోబెట్టి బాబా గురించి పరిచయం చేశారు. అప్పటి వరక మాకు సాయి బాబా అంటే ఎవరో తెలియదు. గురువుగారు షిరిడి వెళ్ళినప్పుడు బాబా ఫోటోలు తీసుకువచ్చి అందరికీ పంచేవారు. అలా మా ఇంట్లో గురువుగారి పావన స్పర్శ తగిలిన రెండు ఫోటోలు ఉన్నాయి. (ప్రస్తుతం దానిలో ఒక ఫోటో మాత్రమే మిగిలి ఉంది) మధ్యాహ్న హారతి సమయంలో గురువు గారు ఆఫీస్ కి వెళ్తారు కాబట్టి గురుపత్ని గారు మా అమ్మవాళ్ళు ఆంటీ వాళ్ళు అందరూ కలిసి మధ్యాహ్న హారతి ఇచ్చేవరు .ఒకసారి గురువు గారు ఏదో పని మీద ఊరెళ్ళారు అప్పుడు కాకడ హారతి గురుపత్ని సత్యవతి అమ్మగారు మా అమ్మ వాళ్లందరూ కలిసి యిస్తుండగా ఒక పెద్ద ముసలికోతి గుమ్మం ముందు కనిపించిందట.. హారతి అవుతున్నంత సేపు అక్కడే కూర్చుని వింటూ ఉందట. హారతి అయ్యాక కూడా అది వెళ్లకపోవడంతో, మా అమ్మ పుస్తకం తీసుకుని అదిలించగ అప్పుడు ఆ కోతి మౌనముగా వెళ్లిపోయిందట. కాకడ హారతి సమయంలో అంత తెల్లవారుజామున ఆ కోతి ఎక్కడినుండి వచ్చిందో అని అందరూ ఆశ్చర్యపోయారట. గురువుగారు రాగానే ఈ విషయం చెబితే, సాయి బాబా వారే వచ్చి ఉంటారని సమాధానం ఇచ్చారు.అలాగే గురువు గారు పూజలు నిర్వహించే టప్పుడు పూజలు అయిపోయే సమయంలో ఒక్క సెకండ్ కరెంటు ఇలా పోయి ఇలా వచ్చేది. దాని గురించి ప్రశ్నించగా, బాబా వారు వచ్చారు అనడానికి సంకేతం గా అలా అవుతూ ఉంటుంది అని చెప్పేవారు.
ఒక సారి గురువుగారు షిరిడీ వెళ్తు మా కుటుంబాన్ని కూడా తీసుకు వెళ్లారు. సాయిబాబా సమకాలిన భక్తులు ఇళ్లకు తీసుకెళ్లి ఆ ప్రదేశాల గురించి వివరించేవారు. లక్ష్మీబాయి షిండేకు బాబా ఇచ్చిన నాణేలను అందరికీ చూపించారు.(😢 అవన్నీ తలుచుకుంటే చాలా బాధగా ఉంది. ఇన్ని సంవత్సరాలు నేను ఎందుకు నా సమయాన్ని వృధా చేశాను. గురు సన్నిధి ఎందుకు కోల్పోయాను. ఈ మాయ ప్రపంచం లో పడి వృధా కాలక్షేపం తో సాధన చేయకుండా గడిపాను. అందుకే గడిచిన సమయం తిరిగి రానిది అంటారు. సమయం కన్నా విలువైనది ఈ ప్రపంచంలో లేదు. 40 సంవత్సరాలు వచ్చాయి.ఇక నుండైనా ప్రతిక్షణాన్ని ఒడిసి పట్టుకోవాలని . ప్రతి క్షణం సాయి నామ స్మరణలో సద్గురు లక్ష్యసాధనలో ఉడతా భక్తిగా పాల్గొని నా జీవితాన్ని సార్థకం చేసుకోవాలని ఆశిస్తూ బాబాని వేడుకుంటున్నాను.)
ఇక ఆ స్మృతుల్లో కి మళ్ళీ వెళ్తే… అప్పుడు 87-88 లో శిరిడీలో మరి ఇంత రద్దీ ఉండేది కాదు. సంస్థాన్ వారు గురువుగారిని గుర్తించి సమాధి పై ఎక్కి బాబాని దర్శించుకునే అవకాశం ఇచ్చినట్లు గుర్తు. అప్పటి నుండి కూడా గురువుగారు అపరిగ్రహ నియమంతో ఉంటూ ప్రయాణంలో మేము ఇచ్చిన ఈ పదార్థాన్ని తీసుకోక మౌనంగా బాబా స్మరణలో ఉండేవారు. ఆ రోజులు ఇప్పుడు తిరిగి రావు. అంతటి అవకాశం అంటే గురువు గారితో పాటు షిరిడి దర్శించుకునే అవకాశం మళ్లీ వస్తుందో రాదో.