ఓం శ్రీ సాయినాధాయ నమః
నేను గురు పౌర్ణమి కి శాఖపురం వెళ్లి నప్పుడు గురుదేవుల పాద దర్శనం పొందలేక పోయాను. అలాగే క్రితం సారి హైదరాబాదులో గురుదేవుల సత్సంగం అయిపోయాక గురుదేవులు తిరిగి వెళ్తున్నప్పుడు, అందరికీ దర్శనం లభించిన కూడా నాకు దర్శనం లభించలేదు. ఇలా కొన్ని సంఘటనల వల్ల “నామీద ఎందుకో గురువుగారికి కోపం వచ్చింది, నన్ను గురువుగారు వదిలివేశారు. నేను ఏదో పొరపాటు తప్పు చేసి ఉంటాను” అని మనసులో గత కొన్ని నెలలుగా మధన పడుతున్నాను. నా మీద నాకే కోపం వస్తూ ఏదో ఒక బెంగగా ఉంటూ వస్తున్నాను. జీవితంలో అంతుతెలియని ఒంటరి ప్రయాణం.. ఏ అనుభవం లేకున్నా, తప్పని పరిస్థితుల్లో ఒంటరిగానే నా ఇంటి నిర్మాణాన్ని, సాయి మందిర నిర్మాణాన్ని చేయించాల్సి వచ్చింది. అడుగడుగున బిల్డర్లు తర్వాత మేస్త్రీలు ఫ్లోరింగ్ చేసేవాళ్ళు ఇలా అడుగడుగునా ప్రతి ఒక్కరు నా దగ్గర డబ్బుల విషయంలో అన్యాయంగా మోసం చేశారు. జీవితం లో మొదటి సారి ఇంత పెద్ద విపత్తును నా మనసు తట్టుకోలేక పోతుంది. చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఈ క్రమంలో ఒక ఆలంబన లేనందువలన మనసు ఇంకా వేదన పడుతుంది. సాయి ఒక్కరేనా ఆశ ఇప్పుడు. ఎలా ఈ ఆర్థిక సంక్షోభం నుంచి నన్ను కాపాడుతారో ఆయన మీదే భారం వేస్తున్నాను. నా ఈ మనోవేదన చూసి కాబోలు సాయి నాకు కల ద్వారా నేను ఉన్నానని చెప్పారు.
మొన్న తెల్లవారుజామున 4:30 కి పేరెంట్స్ ఊరికి వెళుతూ తలుపు గడియ వేసుకోమని నన్ను నిద్ర లేపారు. లేచి తలుపు గడియ వేసుకుని తిరిగి మరల పడుకున్నాను. ఒక కల వచ్చింది.
కలలో..” పూజ్య గురుదేవులు శ్రీ అమ్ముల సాంబశివరావు గారు రంజోల్ గ్రామంలో బాబా నాచే కట్టించిన గుడి ముందు, మందిరంలో బాబా సేవ చేసే బాలకృష్ణ అనే అబ్బాయి తో మాట్లాడుతున్నాడు. “ఏంటి బాబా సేవ మానేస్తావా? అని గురువుగారు ఆ అబ్బాయిని అడగగా, ఆ అబ్బాయి ఆలోచించి “లేదు మానేయను “అని గురువు గారితో చెప్తున్నాడు. తరువాత గురువు గారు మందిరంలో ప్రవేశించి సాయి సేవక్ ( గురువుగారి వద్ద సాయి సేవక్ దీక్ష తీసుకున్న సాయి భక్తులు) లతో మాట్లాడుతున్నారు. నేను అది చూస్తూ, “నాతో అయితే అస్సలు మాట్లాడరు. నాకు తెలుసు అలాగే వెళ్ళిపోతారు. “అని అనుకుంటున్నాను కలలోనే. మరు సెకన్లలోనే గురువుగారు నా ఎదురుగా నిలుచుని కనబడ్డారు. తమ రెండు అరచేతులను చూయిస్తూ(నా అరచేతులని వారి అరచేతుల్లో పెట్టమన్నట్లుగా ) ఉండగా నేను నా చేతులను గురువుగారి చేతిలో పెట్టాను. కలలో గురువు గారి చేతుల స్పర్శ కూడా స్పష్టంగా తగిలింది. నిజం గానే ఉన్నట్టుగా అనిపిస్తుంది.వెంటనే గురువుగారి పాదాల పై తలపెట్టి బాబా నన్ను మంచి మనిషిగా ఎప్పుడూ ఉండేటట్టు చేయు” అని మొక్కుకున్నాను. అప్పుడు గురువుగారి పాదాల స్పర్శ కూడా చాలా స్పష్టంగా నా నుదుటికి తెలుస్తోంది. “… ఇదీ కల.
గురుదేవులు ఈ శిష్యురాలిని వదిలివేశారు అని బాధ పడుతున్న నాకు, “నీ సమస్యలు కష్టాలు నీ బాధ్యత అంతా నాదే ” అన్నట్టుగా కలలో గురువుగారు నా చేతులని తమ చేతిలో తీసుకోవడం ద్వారా తెలిపారు, అని నేను భావిస్తున్నాను.
గురుదేవా సాయి శరణం