మోరేశ్వర్ ప్రథాన్
మోరేశ్వర్ ప్రథాన్ కి బాబా తో గల అనుబంధంవారి మాటల్లోనే ..
సాయంత్రం బాబా తమ శరీరంలో ఒక వైపు స్పృశించుకుంటూ, ‘ఈ ప్రక్కంతా భరించలేనంత నొప్పిగా వుంది; నాలుగు రోజుల్లో తగ్గిపోతుందిలే!’ అన్నారు. కాని చూడడానికి వారు ఆరోగ్యంగానే వుండడం వలన వారి భావమేమో ఎవరికీ అర్థంగాలేదు.
ఒక గురువారంనాడు ఎందరికో సంతర్పణ చేయడానికి ఒక హండాలో బాబా వంట చేస్తున్నాడు. ఆయన మశీదునుండి అందరినీ బయటకు తరిమేసి హండా దగ్గర ఒక్కరే వున్నారు. అపుడు నేను, చందోర్కర్ గారి యిద్దరు అబ్బాయిలూ మశీదు ప్రవేశిస్తుంటే చూచి మాకేమి జరుగుతుందోనని అందరూ భయపడ్డారు. బాబా కోపగించకపోగా, మాకు ప్రత్యేక దర్శనమివ్వడానికే అందరినీ పంపేశారా అన్నట్లు ఎంతో ప్రేమగా ఆదరించారు. కొద్ది సేపట్లో తమలో తామేదో పాడుకుంటున్నారు. ఆయన మూడవసారి గొణుగుతున్నప్పుడు, ‘కాయరే అప్ లాకాయ్ హ్మణావే-శ్రీరాం జయరాం జయజయరాం’ (‘ఏమిరా, మనసులో శ్రీరాం జయరాం జయ జయరాం అని స్మరించుకో!’) అని విన్పించింది. వెంటనే నేను భావావేశంలో వారి పాదాలపై శిరస్సుంచి కన్నీరు కార్చాను. కారణం, మా కులగురువు హరిబువాగారు నాకుపదేశించిన మంత్రమదే! నేను అడగకపోయినా దానిపై నాలో తిరిగి శ్రద్ధ కలిగించి బాబా నా ఆధ్యాత్మిక శ్రేయస్సుకు దోహదం చేస్తున్నారు. హండాలోని వంటకం బాగా వుడుకుతూంటే బాబా కేవలం తమచేత్తోనే కలియబెడుతూ గడ్డలు కట్టకుండా చూస్తున్నారు. అయినా వారి చేయి కాలలేదు.
అకస్మాత్తుగా నాటి మధ్యాహ్నం బాబా మా ముగ్గురినీ లిండీకి తీసుకు వెళ్ళారు. అక్కడ నేలలో చిన్న గుంటలుచేసి, నాచేత కొద్ది విత్తనాలు పెట్టించి వాటి పై మట్టికప్పి నీరు పోయించారు. తర్వాత మేము మశీదుకు తిరిగి వచ్చాము. ఏడెనిమిది సం॥ల తర్వాత (అంటే బాబా మహాసమాధి చెందిన కొద్ది కాలానికి) నేనే లిండీ తోటను కొనడం జరిగింది.
వారం తర్వాత మేము తిరిగి వెళ్ళడానికి బాబా అనుమతించారు. అప్పుడే తీవ్రమైన గాలి, వాన చెలరేగి, పావుగంట సేపు వర్షం పడింది.
ఇంకొంత సేపు వర్షమలాగే పడితే కాల్వలు పొంగి నేను బొంబాయి వెళ్ళడం కష్టమౌతుందని, అపుడు బాబా నన్ను వెళ్ళనివ్వరనీ అనుకొన్నాను. అప్పుడు బాబా ఆకాశంకేసి చూచి, “ఆరె అల్లాహ్, అభీ బర్సాత్ పూరాకర్, మేరే బాల్ బచ్చే ఘర్ జానే వాలే హై; ఉన్ కో సుఖ్ సే జానేదే!” (“ఓ భగవంతుడా యిక వర్షం చాలించు. నా బిడ్డలు యిళ్ళకు వెళ్ళాలి. వాళ్ళని సుఖంగా వెళ్ళనీ;”) అన్నారు. వెంటనే వర్షం తగ్గిపోయింది, నేను బయలుదేరాను.
ఇండ్లకు వెళ్ళేప్పుడు అప్పటివరకూ భక్తులు ఉదీ మాత్రము తీసుకు వెళ్ళేవారు. ఆరతి సమయంలోనే అందరూ పాద తీర్థం తీసుకొనేవారు. బాబు ఒక పళ్ళెంలో బాబా పాదాలు కడిగి, యింటికని తీర్థం సేకరించాడు. అది చూచి నేనుగూడా యింటికి పాదతీర్థం తీసుకున్నాను. అపుడు బాబా నాతో, •” నీ వెంట నేనూ వస్తాను'” అన్నారు.
మేము మన్మాడ్ స్టేషన్ చేరాము. మా రైలుకు యింకా నాలుగైదు గంటలు సమయమున్నది. కొద్ది సేపట్లో పంజాబ్ మెయిల్ వచ్చింది. మావద్దనున్న టికెట్లతో మేమా రైలు ఎక్కకూడదు, కాని మేము ఆ రైలెక్కి 5 గం॥ ముందుగా యిల్లు చేరాము. మేమలా చేయడం ఎంతో మంచిదైంది. బాబా తమ శరీరంలో ఒక ప్రక్క నొప్పిగా వున్నదన్న సమయంలోనే బొంబాయిలో మా అమ్మకు పక్షవాతమొచ్చింది, ఇంట్లో అందరూ నాకు కబురు చేయాలని ఆందోళన పడుతూంటే సమయానికి మాయింట్లో వున్న నానా చందోర్కర్- ,నేను బాబా చెంతనున్నంత వరకూ మా అమ్మకేమీ జరగదని, అవసరమైతే బాబాయే నన్ను పంపగలరనీ చెప్పాడట. డాక్టర్లు, ఆమె పరిస్థితి ఆందోళనకరంగా వుందని, ఆ రాత్రి ఆమెకు విరోచనమైతే ఆమె పరిస్థితి మెరుగవగలదనీ చెప్పారు. తెల్లవారు ఝామునే నేను యిల్లుచేరి మా అమ్మకు ఉదీ, తీర్థమూ యిచ్చాను. కొద్ది సేపట్లో ఆమెకు విరోచనమై జ్వరం విడిచింది. వైద్యులు ఆమెకు గండం గడిచిందన్నారు. సరిగా సమయానికి నన్ను శిరిడీ నుండి పంపడము, మేము పంజాబ్ మెయిల్ లో సమయానికి యిల్లుచేరడము బాబా సంకల్పమే. ఆయన చెప్పినట్లే ఆమెకు నాలుగు రోజులలో తగ్గిపోయింది. నాటిరాత్రి నా భార్యకు కలలో, వంటికి కఫ్నీ, తలకు రుమాలు ధరించిన ఒక ఫకీరు మాయింట్లో వున్నట్లు కనిపించారు. ఆ మాట విన్నాక, “నేను ‘నీవెంట వస్తాను” అని బాబా ఎందుకన్నారో అర్థమైంది. ఆయన మాయింట్లోనే వున్నారు. తర్వాత మా అమ్మ నాలుగు సం॥లు జీవించింది.