శ్రీ మోరేశ్వర్ ప్రధాన్ కి బాబా తో గల అనుబంధం -మూడవ భాగం
మోరేశ్వర్ ప్రథాన్ కి బాబా తో గల అనుబంధంవారి మాటల్లోనే ..
“ఒకసారి నా భార్యకు బాబా కలలో దర్శనమిచ్చారు. అపుడు నేను సకుటుంబంగా శిరిడీ బయల్దేరుతున్నానని, ముందుగా కోపర్గాంలో మాకు వసతులు ఏర్పాటుచేయమనీ నానాసాహెబ్ చందోర్కరు జాబు వ్రాశాను. అతనికి రోజు విడిచి రోజు జ్వరం వస్తుంటే శిరిడీ వచ్చాడు. సామాన్యంగా జ్వరమొచ్చే రోజే నా జాబు చేరింది. అయినా అతడు కోపర్గాంకు బయలుదేరితే బాబా అనుమతిచ్చారు. అతని బదులు కాకా దీక్షిత్ కోపర్గాం వెడతానంటే బాబా అతనిని కసిరి, చందోర్కర్ నే పంపారు. అతడు కోపర్గాంలో మాకు వసతులు ఏర్పాటు చేశాడు. అయినా అతనికి ఆ జ్వరమింక రానేలేదు.
మేము శిరిడీ చేరగానే బాబా నా భార్యను చూపి మాధవరావ్ దేశ్ పాండేతో, ‘ఈమె మా బాబుకు తల్లి’ అన్నారు. సరిగా 12 మాసాలకు మాకు మగబిడ్డ కల్గాడు, బాబా మాటననుసరించి వాడికి మేము ‘బాబు’ అని పేరు పెట్టాము. నామకరణానికి దాసగణు, నానాచందోర్కర్ మొ.న వారందరూ రావడంతో ఆ వేడుక బాగా జరిగింది.”
ఆ పిల్లవాడి గురించి ఒకసారి బాబా యిలా తెల్పారు; ‘ఒకప్పుడు శిరిడీలో ఎంతో పవిత్రుడైన ఒక వృద్ధుడు 12 సం.లకు పైగా నివసించాడు. అతని భార్య, బిడ్డలు జాల్నాలో వుండేవారు. వాళ్ళు అతనిని యింటికి రమ్మని పదే పదే కోరుతుంటే అతడు గుర్రంమీద బయలుదేరాడు. అతనికి తోడుగా నేనుగూడ బండిలో వెళ్ళాను. కొంతకాలానికి ఆ వృద్ధుడు తన సోదరి కుమార్తెను వివాహం చేసుకున్నాడు. వారికి ఒక కొడుకు పుట్టాక ఆరు సం.లకు ఆ వృద్ధుడు మరణించాడు. అతని కుమారుడే తర్వాత బాబుగా జన్మించాడు. ‘
ఆ ‘బాబు’ సాటే మామగారైన గణేష్ కేల్కర్ బంధువు. ఒకసారి అతనికి బాబా స్వప్న దర్శనమిచ్చి శిరిడీకి పిలిచారు. అతడు వెంటనే కాలినడకన శిరిడీ చేరి ఆయనను దర్శించాడు. తర్వాత అతడు కోపర్గాం, యవలా గ్రామాలకు సర్వేయర్ గా సాటే క్రింద పనిచేస్తుండేవాడు. కాని సాటే ఎన్నిసార్లు హెచ్చరించినా బాబు పట్టించుకోక ఎక్కువ సమయం బాబా సేవలోనే గడిపేవాడు. చివరకు గణేశ్ కేల్కర్, సాటేలు బాబాతో ఫిర్యాదు చేశారు.. బాబా ఏమీ పట్టించుకొనక, ఆ పనులన్నీ అలా వుంచి, అతనిని నా సేవ చేసుకోనీయండి” అన్నారు. అప్పటి నుండీ సాటేరే, కేల్కర్లు అతనికి ఏ పనులూ చెప్పేవారుగాదు. తరచుగా భక్తులు తమకు నివేదించే ప్రసాదాలలో మంచివి ఏరి బాబుకు పెడుతుండేవారు బాబా. సం॥ 1910లో బాబా ఒకసారి కేల్కర్తో, ‘బాబు విషయంలో జాగ్రత్త తీసుకో!’ అని హెచ్చరించారు. అతనికేమీ అర్ధంగా లేదు. బాబుకు తీవ్రమైన జ్వరం వచ్చింది. బాబా ఒకరోజు కేల్కర్’, ‘బాబు యింకా బ్రతికేవున్నాడా? ‘ అన్నారు. ఆ మాటకు కేల్కర్ త్రుళ్ళిపడ్డాడు. కొద్ది రోజులలో బాబు తన 22వ యేట శిరిడీలోనే చనిపోయాడు. అటుతర్వాతగూడ బాబా తరచుగా అతనిని తలచుకుంటుండేవారు. అతడే శ్రీమతి ప్రధాన్ కడుపున జన్మించబోతాడని బాబా ముందుగా చెప్పారు. తర్వాత వృత్తాంతం ప్రథాన్ యిలా వ్రాశాడు.
“బాబు పుట్టాక నా భార్య బాబాను తన యింటి ఇలవేల్పుగా తలచింది. మా వంశాచారం ప్రకారం యింటి కోడలు బిడ్డను కన్నక గోధుమలు, కొబ్బరికాయ పండ్లు కొంగున కట్టుకుని వెళ్ళి అత్తవారి యింటి ఇలవేల్పుకు సమర్పించాలి. ఆ రీతినే నా భార్య బాబాను దర్శించింది. ఆయన సంతోషంగా ఆ నివేదన అందుకుని పళ్ళెంలో పెట్టి, బాబును ఎత్తుకొని ఎంతో ప్రేమగా, ‘బాబూ, నీవెక్కడకు వెళ్ళావు? నామీద కోపమొచ్చిందా; లేక విసుగు పుట్టిందా? ‘ అన్నారు. తమ సంతోషానికి చిహ్నంగా ఆయన రు. 2/- లకు ‘బర్ఫీ’ (మిఠాయి) కొని అందరికీ పంచారు. ఇది జరిగినది 1912లో.
అప్పుడే ఒకరోజు శిరిడీ గ్రామ ప్రాకారంలోని రాతి తోరణం చూపి, ‘దీనిని పునరుద్ధరించిన వారికి ఆశీర్వచనం లభిస్తుంది’ అన్నారు. వెంటనే నా భార్య ఆ సేవను కోరింది. ఆయన అనుమతించారు. ఆ పని చేయించమని నానా చందోర్కరకు రు. 600/-లు యిచ్చాను. మరొకరోజు బాబా, ‘బాబుకోసం ఒక అందమైన బంగళా సిద్ధంగా వున్నది’ అన్నారు. వారి భావం గుర్తించి ఆరు మాసాలలో మేమిప్పుడు నివసిస్తున్న బంగళా కొన్నాను.
తరువాత బాబును మొదటి పుట్టినరోజుకు బాబా దర్శనానికి తీసుకు వెళ్ళాము. అప్పుడు గూడ తమ సంతోషానికి చిహ్నంగా రు. 2/-లతో బర్ఫీ కొని అందరికీ పంచారు. అపుడాయన ఎంతో భావగర్భితంగా, “వీడికి ఒక చెల్లెలు లేదా?’ అన్నారు. నా భార్య సిగ్గుపడుతూనే, ‘మీరు మాకు మా బాబును మాత్రమే ప్రసాదించారు’ అన్నది. తర్వాత మాకొక పాప, ఒక బాబు, మరో పాప కూడ కలిగారు.
బాబు యొక్క మొదటి పుట్టిన రోజున మాధవరావ్ దేశ్ పాండే యింట్లో విందు ఏర్పాటు చేస్తున్నారు. బాలాభాటే ఆ విందుకు రాలేదు. అతడు బాబాను దర్శించినప్పుడు ఆయన, ‘భావూ ఇంట్లో భోజనం చేశావా?’ అని అడిగారు. ‘గురువారంనాడు బయటెక్కడా భోంచేయకూడదన్నది నా నియమం. అందుకని వెళ్ళలేదు’ అన్నాడు భాటే. ‘ఆ నియమం ఎవరి ప్రీతికోసం? ‘ అన్నారు బాబా. ‘మీ ప్రీతికోసమే!’ అన్నాడతడు. ‘అలా అయితే భావూ యింట్లో భోజనం చేసిరా’ అన్నారు బాబా. సాయంత్రం 4 గంటలకు భాటే వచ్చి మాతో కలసి భోజనం చేశాడు.
ఆ తరువాత ఒకప్పుడు ‘శాంతాక్రజ్ ‘ లో నా భార్యకు బాబా స్వప్న దర్శనమిచ్చి ఆమెచేత పాదపూజ చేయించుకున్నారు. అది బాబా సందేశమని చెప్పి, నానా చందోర్కర్ ఆమెను వెండి పాదుకలు తీసుకుని శిరిడీ వెళ్ళమని చెప్పాడు. ఆమె శిరిడీ చేరి మశీదుకు వెళ్ళేసరికి అంతవరకూ కాళ్ళు ముడుచుకుని కూర్చున్న బాబా తమకై తామే కాళ్ళు ముందుకు చాపి, ‘ఆ పాదుకలు యీ పాదాలపై పెట్టి పూజించుకో!’ అన్నారు. ఆమె అలా చేయగానే నానా తో ఆయన, ‘ఈ తల్లి చూడు, నా పాదాలు కోసి తీసుకువెత్తోంది!’ అని ఆ పాదుకలు ఆమె చేతికి యిచ్చారు. అప్పటి నుండి నిత్యమూ ఆమె ఆ పాదుకలు పూజించుకుంటున్నది.”