ఓం శ్రీ సాయి నాదాయనమః
భయ్యాజీ అప్పాజీ పాటిల్ కి సాయి పట్ల గల సర్వస్వ శరణాగతి తెలిపే క్రింది సంఘటన ని పాటిల్ గారి మాటల్లోనే తెలుసుకుందాము..
“నా పసితనంనుండి నేను బాబాను ఎరుగదును. బాబా తమ జీవితాంతము భిక్ష చేసుకున్న కొద్ది యిళ్ళలో మాది ఒకటి. “సుమారు 3 సం.లపాటు బాబా మాయింటికి భిక్షకు రోజుకు 8సార్లుగూడ వచ్చారు. తర్వాత 3 సం.ల పాటు రోజుకు 4సార్లు వచ్చారు. ఆ తర్వాత 12 సం.లు రోజుకొక్కసారి మాత్రమే వచ్చారు. నా 11వ సం. నుండీ బాబాను సేవిస్తుండేవాడిని.
1913లో 70 యేండ్ల వయస్సుగల మా తండ్రి తన అలవాటు ప్రకారం గుర్రంమీద బయటకు వెళ్ళి పక్షవాతంతో యింటికి వచ్చాడు. నేను బాబావద్దకు వెళ్ళి ఉదీ అడిగాను. బాబా, “ నేను ఉదీ యివ్వను. అల్లామాలిక్ హై” అన్నారు. నేను ఏడ్చేశాను. నాటికి మూడవరోజున కార్తీక శుద్ధ ఏకాదశీ ఆదివారంనాడు మా తండ్రి మరణించాడు. మరురోజు యథాపూర్వం నేను మశీదుకు వెళ్ళి బాబా పాదాలు వత్తాను”.
“నాకు భీమునియంతటి బలమని ఎప్పుడూ గర్వంగా చెప్పుకుంటుండేవాడిని. ఒక రోజు వారి పాదాలొత్తాక బాబాను నా చేతులపై ఎత్తి తీసుకు వెళ్ళి ధునివద్ద దించాలని ప్రయత్నించాను. అంతకుముందు ఎన్నోసార్లు అలా చేశాను గూడ. కాని ఆరోజు ఆయనను పైకి లేపనే లేకపోయాను. బాబా నన్ను చూచి నవ్వి నా గర్వం అణచివేశారు.
ఆనాడు ద్వాదశి, బాబా నాకు రెండు గుణపాఠాలు నేర్పారు – నేను గర్వించకూడదని, నా తండ్రి మరణించనందుకు శోకించకూడదని. “ నీవెందుకు దుఃఖించాలి? అతడు 5 నెలల్లో తిరిగి వస్తాడు’ అన్నారు. ఆయన చెప్పిన సమయానికే నాకు కొడుకు పుట్టాడు.
బాబా తమ చివరి రోజున నాకు చివరిసారిగా నీతి బోధించారు. కాకా దీక్షిత్ ను అక్కడనుండి పంపివేశాక నాకొక నీతినేర్పి, ‘అది ఎవరికీ చెప్పవద్దు, చెప్పావంటే చచ్చిపోతావు!’ అన్నారు. తర్వాత ఆయన, ‘నేను వెళ్ళిపోతున్నాను. నన్ను వాడాకు తీసుకుపోండి. బ్రాహ్మణులంతా అక్కడ నావద్దనే నివసిస్తుంటారు’ అని చెప్పి బాబా నన్ను ఆనుకుని శరీరం విడిచారు. ఆ తర్వాత నానా నిమోస్కర్ వారి నోట్లో నీరుపోస్తే అదంతా బయటకు వచ్చేసింది. ఆ నీరు పట్టుకోవాలని వారి గడ్డం క్రింద నాచేయి పెట్టాను. “
సాయిబాబాతో నిత్యసాంగత్యం వలన బయ్యాజీ అప్పాజి పాటిల్ హృదయంలో అతనికి తెలియకుండానే, అతని ప్రయత్నము – సాధన ఏమీ లేకనే ఎంతటి ఉత్తమ సంస్కారం కల్గిందో యీ ఒక్క సంఘటన గురించీ ఆలోచిస్తే తెలుస్తుంది. ఒకవంక అతని కన్నతండ్రి మృత్యుముఖంలో వున్నాడు. మరోవంక తలుచుకుంటే ఏమైనా చేయగల సమర్థ సద్గురువు సాయి అతని యింటికి కొద్దిదూరంలోనే వున్నారు. కనుక అతడు తన తండ్రిని బ్రతికించమని అనన్యంగా ఆయనను శరణు బొందాడు. అయినప్పటికీ అతనికి సాయి ఉదీ యివ్వనపుడు మరెవరికైనా అయితే ఆయనపట్ల పట్టరాని కోపం వస్తుంది. అంతవరకూ ఆయనపట్ల వున్న భక్తి శ్రద్ధలు అడుగంటిపోతాయి. సాయి తమవల్ల గాకనే తన తండ్రిని రక్షించలేదని అతడు సమాధానపడబోతే సాయి సర్వ సమర్థులు, సాక్షాత్తూ భగవంతుడు అన్న విశ్వాసం సడలిపోతుంది. అలాగాక, ఆయన సర్వ సమర్థులైనప్పటికీ తన ప్రార్థన మన్నించలేదనుకొంటే ఆయన ప్రేమస్వరూపమని, తన ఏకైక రక్షకులన్న భావం నశించిపోతుంది. అంతవరకూ అతడు గతంలో చేసిన సేవంతా వ్యర్థమని, ఆయన కేవలం తనను వాడుకొన్నారని తలచడం ఆ పరిస్థితుల్లో సామాన్యులకు అన్పించి తీరుతుంది. అటు తర్వాత మళ్ళీ ఆయనను దర్శించడంగూడ కష్టమే. అట్టి మానసిక స్థితిలో సాయి గురించి అతడంతకుముందు వినిన కువిమర్శలు, దుష్ప్రచారాలు – అన్నీ వాస్తవాలన్పిస్తాయి. ఒకవేళ ఎవరైనా ఆ విఘాతానికి తట్టుకొని, మనస్సును సమాధాన పరచుకోగల్గినప్పటికీ అందుకెంతో కాలం పడుతుంది. ఏమైనప్పటికీ పితృశోకమైనా కొంతకాలం సామాన్యులను కృంగదీయక మానదు. కాని బయ్యాజీ పాటిల్ లో యివేవీ కన్పించవు. అతడు తన తండ్రి మరణించిన మరురోజే ఎప్పటివలె ఆయనను దర్శించి పాద సేవ చేసుకున్నాడు. తన తండ్రిని ఎందుకు రక్షించ లేదని అతడు బాధగా ఆయనొక్కసారి గూడ అడగలేదు. ఆయనపట్ల అతని భక్తి శ్రద్ధలు, ప్రేమ కించిత్తు గూడా చలించలేదు. అది అసలైన భక్తి. అదే సాయికోరే దక్షిణలోని నిష్ఠ . అది అతనికి సాయి సన్నిధి ప్రసాదించిన వరమేనని తలచవచ్చు.
సేకరణ : శ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ గారి “సాయి సన్నిధి ‘