శ్రీ సాయినాధాయనమః
మనము బాబా ను ఏమయినా కోరుకున్నప్పుడు బాబా పై నమ్మకము , ఓర్పు విశ్వాసాలతో వేచి వుండటము చాలా అవసరము. అది లోపించినప్పుడు అనగా బాబా మన కోరిక తీరుస్తాడని పూర్తి నమ్మకము లేనప్పుడు ఫలితం కూడా అలాగే ఉంటుంది . మన అవిశ్వాసమే మన కోరిక తీరకపోవడానికి ప్రధాన కారణం అవుతుంది .. ఎందుకంటె ,“వారి వారి విశ్వాసాలు భావాలకి అనుగుణంగా నే నేను నా భక్తులను అనుగ్రహిస్తాను”అని సాయి చెప్పిన మాట ఈ సందర్భం లో గుర్తుంచుకోవాలి . షిరిడి లో బాబా భౌతికం గా నివశించిన కాలం లో మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేవారని మనకు తెలుసు . ఆ బ్రిటిష్ అధికారుల్లో ఒకరి భార్య శ్రీమతి కర్టిస్ యొక్క అనుభవం లో మనం ఇది గమనించవచ్చు .
ఆరోజుల్లో మన ప్రభుత్వంలో పెద్ద ఉద్యోగులందరూ ఇంగ్లీషువారే. వాళ్ళు గూడా బాబా దర్శనానికి వస్తుండేవాళ్ళు. మార్చి 10, 1911న ఉదయం 7 గంటలకు బాబా మశీదులో వున్నారు. అంతకుముందే ఆయనెంతో ప్రేమగా కాకాసాహెబ్ దీక్షిత్ కు బొంబాయి వెళ్ళడానికనుమతించి ఆశీర్వదించి పంపారు. ఇంతలోనే ఏమైందో ఆయనొక్కసారిగా కోపోద్రిక్తులై, తమ కఫ్నీ పైకెత్తి “సాలా, హంకోధేకోనేకో ఆతా హై హమారే పాస్ క్యా హై? హంతో నంగా ఫకీర్ హై” – అంటే ” ఆ తుచ్చులు నన్ను చూడడానికి వస్తున్నారు. నా దగ్గర చూడడానికేమున్నది? నేను సరైన గుడ్డలు గూడా లేని ఫకీరునే గదా!” అని అరచారు. ఆయన ఎవరిని తిడుతున్నారో తెలియక భక్తులు నివ్వెరబోయారు. కొద్ది సేపు తర్వాత ప్రభుత్వ కేంద్ర విభాగానికి కమీషనరయిన సర్ జాన్ కర్టిస్, అతడి భార్య, అహ్మద్ నగర్ జిల్లా కలెక్టరయిన మెక్లీన్స్దొర, అతని క్రింద ఉద్యోగియైన రామచంద్ర జోగేకర్ తో శిరిడీ చేరారు. వారు రాబోతున్నారని గ్రామంలో ఎవరికీ తెలియదు. తర్వాత ఎప్పుడో తెలిసింది. శ్రీమతి కర్టిస్ కు పిల్లల్లేరు. బాబా ఆశీస్సులతో బిడ్డలు కలుగుతారని ఆశించి వారంతా దర్శనానికి వచ్చారట.
ఈ బృందమంతా తిన్నగా చావడి కెళ్ళారు. ఆ సంగతి తెలియగానే గ్రామంలో సంచలనం లేచింది. అందరూ ఆ వచ్చినవారికి ఏర్పాట్లు చేయడానికి అటూ ఇటూ పరుగులు తీస్తున్నారు. గ్రామంలో పెద్దవాళ్ళు యిళ్ళ నుండి మూడు కుర్చీలు తీసుకుని చావడికి పరిగెత్తారు. చావడిలో వాటి పై దొరలందరూ కూర్చున్నాక జోగేకర్ ఎంతో వినమ్రతతో వారి వెనుక నిలబడ్డాడు. మమల్తదారుగా రిటైరయిన బాలాసాహెబ్ భాటే అనే సాయి భక్తుడు ఆసమయంలో శిరిడీలోనే వున్నాడని తెలిసి, అతణ్ణి చావడికి రమ్మని జోగేకర్ కబురు చేశాడు. అతడు సాయి సన్నిధి విడిచి రావడం సాధ్యంగాదని కబురు చేసాడు. అపుడక్కడ సహస్రబుద్దే వున్నాడు. అపుడు వారు జోగేకర్ ను భాటే యింటికి రమ్మని కబురుచేసి అతడితో అక్కడే మాట్లాడారు. బాబా దర్శనానికి పెద్ద పెద్ద ఆఫీసరైన దొరలొచ్చారని, కనుక కాలకృత్యాలు త్వరగా ముగించుకొని వారికి దర్శనమీయడానికి త్వరగా సిద్ధం గమ్మని బాబాతో చెప్పవలసిందిగా సహస్రబుద్దేను జోగేకర్ కోరాడు. ఆ మాట వింటూనే అతడు నివ్వెరబోయి, ” అంతటి మహనీయునికి అలా చెప్పడానికేంత ధైర్యం? వారి ఆశీస్సులు పొందడానికి వచ్చినపుడు వారు దర్శనం యిచ్చినదాకా వేచియుండవవలసిందే!” అన్నాడు.
ఆ బృందం శిరిడి చేరేసరికి-బాబా కాళ్ళు, చేతులు, ముఖమూ కడుక్కోబోతున్నారు. ఆ వెంటనే బాబా భిక్షకని గ్రామంలోకి వెళ్ళి, అర్థగంట తర్వాత తిరిగి వస్తున్నారు. ఆయన చావడియెదుట కొచ్చేసరికి శ్రీమతి కర్టిన్ గబగబా ఆయన వద్దకొచ్చి, ‘ బాబా! అప్ కే సాథ్ కుచ్ బాత్ కర్ నేకీ హై” ”బాబా! మీతో కొంచెం మాట్లాడాలి” అన్నది. బాబా ఆమెను పట్టించుకోకుండా, “ఆధా ఘంటా టైర్ జావ్!” ”అర్థగంటాగు” అని కసరి ముందుకు సాగిపోయారు. అర్థగంటయ్యాక బాబా మళ్ళీ బయల్దేరి చావడి ముందుగా వెళ్తూంటే ఆమె మళ్ళీ అలానే కోరింది. బాబా ఆమెకేసి కొరకొరా చూచి, ‘ ఏక్ ఘంటా టైర్ జావ్!” – ” ఒక గంటాగు” అని మశీదు కొచ్చేసారు.
అప్పటికి దొరలందరూ అల్పాహారం తినేసారు. వారికి టైములేక తిరిగి వెళ్ళిపోయారు. వెళ్ళేముందు కర్టిస్ దొర సహస్రబుద్దేకు రూ.5/- యిచ్చి, శిరిడీ లోని పేదలకు దానం చేయమని చెప్పాడు. ”నేనే చెయ్యాలంటే వీలుగాదు. నేనైతే ఈ పైకం బాబాకి యిస్తాను. దీనిని పేదలకి పంచాలంటే మునుసబుకో, గ్రామ కరణానికో యివ్వండి” అన్నాడు సహస్రబుద్దే. కర్టిన్ హతాశుడయి చేసేది లేక ” నీకు తోచినట్లు చేయి” అని చెప్పి వెళ్ళిపోయాడు. మెక్లీన్ దొర రూ. 5/-లు, జోగేకర్ రూl/2/-లు అతనికే యిచ్చి వెళ్ళిపోయారు. అదంతా కలిపి బాబాకు సమర్పించాడు నహస్రబుద్దే. బాబా దానిని స్వీకరించక తిరిగిచ్చేరు. కొద్దిసేపాగి మళ్ళీ యిస్తే తీసుకున్నారుగాని, వెంటనే అక్కడున్న పేదభక్తుని కిచ్చేసారు. రెండు గంటల తర్వాత మధ్యాహ్న హారతికని సహస్రాబుద్దే. మశీదుకెళ్ళినపుడు బాబా అతనితో, ‘ఆ గవర్నరుగాడివ్వవలసిన రూ.30/- నాకివ్వు?” అన్నారు. సహస్రబుద్దే నివ్వెరబోయి, ఆ బృందంలో తన కెవరెవరెంతిచ్చారో చెప్పి, ”ఆ మొత్తం రూ. 12/-తమకే సమర్పించాను. ఆ మిగిలిన రూ. 18/- నన్నివ్వమంటే యిస్తాను” అన్నాడు. ఆ మాట వినిపించుకోకుండా, ” ఆ తెల్ల వెధవలే నాకు రూ. 30/- యివ్వాలి. నీడబ్బు నాకెందుకు?” అన్నారు బాబా.
మొదట సహస్రబుద్దేకేమీ అర్థంకాలేదు. కాని, బాబా మాట్లాడిన ఒక్క మాట గూడ వ్యర్థంగాదని అతడికి తెలుసు కనుక అతడు వెంటనే ఆహమ్మద్ నగర్ కు శ్రీమతి కర్టిస్ తో మాట్లాడి వివరాలు తెల్పమని జోగేకర్ కు జాబు వ్రాశాడు. తిరుగు టపాలో జోగేకర్ జాబు వ్రాశాడు. శిరిడీలో సహస్రబుద్ధేకు పైకమిచ్చే ముందు ఆ విషయమై కర్టిస్ దంపతులు వాదించుకున్నారు. మొదట శ్రీమతి కర్టిస్ శిరిడీలో ఏదైనా ధర్మం చేయడానికి కొంత పైకం సహస్రబుద్దే కివ్వమన్నప్పుడు కర్టిన్ ఒక్క రూపాయి మాత్రమే యిస్తానన్నాడట. ” అది నీ హోదాకు, అంతస్థుకూ సిగ్గుచేటు. నీవు కనీసం రూ. 25/- అయినా యివ్వాలి” అన్నది మె. మొదట అతడు నిరాకరించినా ఆమె పట్టుబట్టిన మీదట ఎలాగో రూ. 5/-లు యిచ్చాడు. మెక్లీన్ యిచ్చిన రూ. 5/-లు, అతడివ్వవలసిన రూ. 25/-లు కలిపితే మొత్తం 30 రూపాయలే!
శ్రీమతి కర్టిస్ కు తమపట్ల ధృడమైన భక్తి లేకపోవడంవల్ల బాబా ఆమె భక్తికి, ఓరిమికీ పరీక్ష పెట్టారు. ఆమె ఓడిపోయింది. అందువలన ఆమె కోరిక నెరవేరలేదు. అయితేనేమి, బాబాను దర్శించినందుకు కర్టిస్ కు అంతకంటే పై పదవి బొంబాయిలో త్వరలోనే లభించింది.