సాయి వాణి :విశ్వాసం తో నన్ను నమ్ము. నిన్ను అన్ని వైపుల నుండి రక్షించేదను . నాపై నమ్మకం కలవారికి జయము కలుగును.

మన అవసరాలు ఏంటో మనకు తెలియదు కానీ సాయి కి తెలుసు

ఓం శ్రీ సాయినాథాయ నమః

బిట్టికి తన అవసరాలు ఏంటో తెలియకపోయినా తల్లి సకాలంలో గుర్తించి తన బిడ్డకు ఏమి కావాలో వెంటనే సమకూరుస్తుంది. మన దైవం అయిన సాయినాథుడు కూడా తన భక్తుల అవసరాలను తల్లి వలె గుర్తించి వారు అడగకపోయినా సరైన సమయంలో వారికి అందించడంలో అప్రమత్తంగా ఉంటాడు.

ఈరోజు జూన్ 1. ఈరోజు గవర్నమెంట్ టీచరుగా శాలరీ అందుకుని ఇంటి అద్దె ఇలా మొదలైన ఖర్చులన్నీ చెల్లించిన తర్వాత ఎందుకో ఈ రోజు నా ఆలోచన లు నన్ను గతం లో కి తీసుకెళ్లాయి. నేను ఈరోజు ఎవరిపై ఆధారపడకుండా స్వతంత్రంగా బతుకగలుగుతున్నాను అంటే దాని వెనుక సాయి చూపిన లీల గుర్తుకొచ్చింది. విడాకులు తీసుకుని పుట్టింటికి వచ్చిన తర్వాత నా జీవితం గురించి, నా భవిష్యత్తు గురించి నేను అసలు ఆలోచించలేదు. కానీ ఒంటరి మహిళ గా నా అవసరం ఏమిటో నాకు తెలియకపోయినా సాయి కి చక్కగా తెలుసు కాబట్టి ఆయా పరిస్థితులను అవకాశాలను కల్పించి నన్ను నా కెరియర్ దిశగా నడిపించాడు. ఒకరోజు దినపత్రిక తిరగేస్తుండగా హిందీ పరీక్షలు కి సంబంధించిన ఒక పత్రిక ప్రకటన మీద నా దృష్టి పడింది. స్కూల్లో చదువుతున్నప్పుడే హిందీ మీద నాకు ఆసక్తి ఉండేది. నా ఆసక్తికి తగ్గట్టుగా సాయి ఆ పత్రిక ప్రకటన నాకు కనిపించేలా చేసాడు. హిందీ భాష కి సంబంధించి హిందీ ప్రచార సభ వారు నిర్వహించే హిందీ పరీక్షల తేదీలు మొదలైన సమాచారం గల పత్రిక ప్రకటన అది. ఆ ప్రకటన చూడగానే నాలో ఆ పరీక్షలు రాయాలని ప్రేరణ కలిగింది. హిందీ పరీక్షలు రాసి డిఎస్సి రాయడం ద్వారా గవర్నమెంట్ టీచర్ జాబు వస్తుంది అని నేను చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ లో ఒక హిందీ అధ్యాపకుడి మాటలు గుర్తొచ్చి ఆ దిశగా ప్రయత్నం చేయాలనే ప్రేరణ కలిగింది.దీనితో మా పేరెంట్స్ ఉంటున్న ఇంట్లో నే క్రింద అద్దె కి ఉంటున్న ఒక గవర్నమెంట్ టీచర్ ని సంప్రదించి స్థానికంగా హిందీ పరీక్ష లు నిర్వహిస్తున్నవారి నంబర్ తెలుసుకోవడం జరిగింది. తర్వాత వారిని కలుసుకుని హిందీ టీచర్ అవ్వాలంటే ఏ పరీక్షలు రాయాలి మొదలైన వివరాలన్నీ తెలుసుకోవడం జరిగింది. ఆ విధంగా కేవలం ఇంటర్మీడియట్ అర్హతతో నేను డిగ్రీకి సమానమైన హిందీ విద్వాన్ పరీక్షలను రాశాను. ఆ తర్వాత హిందీ పండిట్ కోర్సుకి సంబంధించిన ఎలిజబిలిటీ టెస్ట్ కూడా రాసి సాయి దయతో మంచి మార్కులతో పాస్ అవ్వడం జరిగింది. ఈ అన్ని ఎగ్జామ్స్ కి కోచింగ్ తీసుకోకుండా సొంతంగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాసాను. ఆ తరువాత నాంపల్లి హిందీ పండిత్ కాలేజీలో సీటు సంపాదించడం హిందీ పండిత్ ట్రైనింగ్ పూర్తి చేయడం జరిగింది.

ఇక ముఖ్యమైనది డీఎస్సీ ఎగ్జామ్. దీని గురించి హైదరాబాద్ లో మరియు అవనిగడ్డలో శిక్షణ తీసుకున్నాను. అయితే మొదటి ప్రయత్నంలో ఒక్క మార్కులో జాబు మిస్ అయింది.నేను చాలా బాధపడి బాబా ని ఈ విషయం గురించి అడుగుతూ సాయి జీవిత చరిత్ర లో ఒక పేజీ తెరిచాను. ఆ పేజీ లో ” బాబా ఒక భక్తుడికి రెండవ వివాహం చేసుకున్నచో పుత్ర సంతానం కలుగునని ఆశీర్వదించారు కానీ వారికి మొదటిసారి పుత్ర సంతానం కలగలేదు. మూడవసారి నిజం గానే కొడుకు పుట్టెను.ఈ విధంగా బాబా మాటలు సత్యములైనవని వారు ఆనందించిరి .” అనే సందేశం చదివి తరువాత ప్రయత్నం లో బాబా అనుగ్రహిస్తారేమోనని ఊరట చెందాను.

రెండు సంవత్సరాల తరువాత(2008) మళ్లీ dsc నోటిఫికేషన్ వచ్చింది. అయితే మొదటిసారి చేసిన ప్రయత్నంలో నేను job పొందలేక పోయాను అనే బాధ, ఇంకా కొన్ని సమస్యల వల్ల ఆ time లో నేను డిప్రెషన్ లో ఉండేదాన్ని.. DSC కోసం ఎక్కడా కోచింగ్ తీసుకోవాలనిపించక నామమాత్రంగా ప్రిపేర్ అయ్యేదాన్ని. ఒక రెండు పేజీలు చదివి ఊరుకునేదాన్ని.నిరాశ గా నిర్లిప్తం గా ఉంటూ సరిగ్గా చదవలేక పోయేదాన్ని. Exam date దగ్గరికి రాగానే మా పేరెంట్స్ తో “నేను ఎగ్జామ్ రాయను ఎందుకంటే నేను బాగా ప్రిపేర్ అవలేదు కాబట్టి ఈసారి కూడా నాకు జాబ్ రాదు. నేను ఎగ్జామ్ రాయడం వేస్ట్, నేను రాయను “అని ఖరాఖండి గా ఒకరోజు చెప్పేసాను. కానీ బాబా వారు ఊరుకుంటారా? మా పేరెంట్స్ ద్వారా మా గురువుగారికి ఫోన్ చేయించి నా విషయం తెలపడం జరిగింది. ఇలా మా అమ్మాయి ఎగ్జామ్ రాయను అంటుంది మీరేమైనా తనకు చెప్తారా? అని పూజ్య గురుదేవులు శ్రీ అమ్ముల సాంబశివరావు గారిని మా తల్లిదండ్రులు సంప్రదించడం జరిగింది. అప్పుడు గురువుగారు వారితో మీ అమ్మాయిని నాతో మాట్లాడించండి అని చెప్పగా నేను గురువు గారికి ఫోన్ చేయడం జరిగింది. ఫోన్లో గురువుగారు “ఎంత వస్తే అంత వ్రాయి కానీ నువ్వు తప్పకుండా DSC ఎగ్జామ్ వ్రాయాలి ” అని సలహా ఇచ్చారు. నాకు EXAM రాయాలనే ఆసక్తి లేకపోయినా గురువుగారు చెప్పారని ఎగ్జామ్ రాశాను. చిత్రంగా ఎగ్జామ్ క్వశ్చన్ర్ పేపర్ లో ఏవైతే నేను చదివానో అవే ప్రశ్నలు ఉండటంతో నేను చక చకా ఆన్సర్స్ పెట్టడం జరిగింది. ఏమీ చదవలేదు ఎగ్జామ్ రాయను అని అనుకున్న నేను, గురువు గారి ద్వారా సాయి ఇచ్చిన సందేశంతో ఎగ్జామ్ రాసి DSC లో జిల్లాలో ఐదవ ర్యాంకు సాధించడం జరిగింది. ఇది పూర్తిగా సాయినాథుడి అనుగ్రహం తప్ప మరొకటి కాదు.ఉద్యోగము నాకు చాలా అవసరం అనే విషయాన్ని బాబా గ్రహించి,నేను డిప్రెషన్ తో ఎగ్జామ్ రాయను అని భీష్మించుకుని కూర్చున్నా నన్ను సాయి వదిలిపెట్టలేదు.గురువు గారి ద్వారా ఎగ్జామ్ రాయాల్సిందేనని చెప్పించి,నాచే ఎగ్జామ్ రాయించి నాకు గవర్నమెంట్ టీచర్ జాబు ని అనుగ్రహించారు. ఒకవేళ నేను అపుడు డిఎస్సి ఎగ్జామ్ రాయక పోయి ఉంటే ఇప్పుడు నేను గవర్నమెంట్ టీచర్ జాబ్ ని పొందలేక పోయేదాన్ని.ఆర్ధికంగా ఎన్నో బాధ లు పడవలసి వచ్చేది. నా భవిష్యత్తు గురించి నాకు బెంగ లేకపోయినా బాబా కన్నతల్లిలా దయతో జాబ్ రావడానికి నేనేం చేయాలో ఆ విధంగా నన్ను నడిపిస్తూ వచ్చారు. నా జీవితానికి ఆసరా గా ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించి నన్ను ఆదుకున్న సాయి నాధుడికి ఏమిచ్చి ఋణం తీర్చుకోగలను? జన్మ జన్మ లకి సాయి సేవ చేసుకునే అవకాశం ఇవ్వమని సాయి ని వేడుకుంటున్నాను.

జై సాయిరాం 🙏

Leave a Reply

WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Discover more from Sai Sannidhi

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

search previous next tag category expand menu location phone mail time cart zoom edit close