
ఓం శ్రీ సాయినాధాయ నమః
పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఒక సాయి భక్తురాలు తన సాయి అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు.
” నేను ఒక సాధారణ సాయి భక్తురాలిని. సాయి నా జీవితం లోని ఒడిదుడుకుల్లో ఎన్నో సార్లు తన ఉనికిని చూయిస్తూ నేను నీకు తోడుగా వున్నాను అని నిరూపిస్తున్నారు. (Just ఇపుడు కూడా నేను ఈ అనుభవాన్ని ఇక్కడిదాకా టైపు చేసి, ఎలా ఇంకాఏం రాయాలి నా అనుభవానికి సంబంధించిన ముందు మాట గా అని అనుకుంటుండగానే “సాయి మహారాజ్ సన్నిధి ” బ్లాగ్ నుండి “సాయి మహరాజ్ పంచుతున్న బాబా ప్రేమ ” అని నోటిఫికేషన్ పంపి తన ప్రేమ ని గుర్తు చేసారు సాయి దేవుడు ) సాయి ప్రేమ సాటి లేనిది. ప్రపంచం లో మన తల్లి తండ్రి పిల్లలు ఎన్ని బంధాలు ఉన్నా, సాయి తో బంధం మాత్రమే నిత్యమైనది, సత్యమైనది. ఈ లౌకిక బంధాలు అన్నీ స్వార్థం తో కూడుకున్నవి. రక్త సంబంధం వల్ల అపుడో ఎపుడో వారి ప్రేమ ని పొందినా, సాయి చూపే అవ్యాజ్య ప్రేమ, షరతులు లేని స్వచ్ఛమైన సాటిలేని విశిష్ట ప్రేమ సాయి సన్నిధిలో తప్ప ఇంకెక్కడా దొరకదు అనేది అక్షర సత్యం.
ఇక నా అనుభవానికి వస్తే,మా అమ్మాయి మూడు రోజుల క్రితం మా ఇంటికి వచ్చింది. తన అత్తగారింట్లోని కొన్ని ఇబ్బందులు చెప్తూ బాధ పడింది. వాళ్ళు వియ్యంకురాలయిన నా నుండి మా అమ్మాయి పెళ్ళి లో ఇచ్చినదానికన్నా ఇంకా ఆశిస్తూ సూటి పోటి మాటలు అంటున్నారని బాధ పడింది.కాగా,ఈ రోజు ఉదయం నేను నిద్ర నుండి లేవగానే సాయి మహరాజ్ సన్నిధి బ్లాగ్ ద్వారా ఈ సందేశం బాబా నాకు ఇచ్చారు

ఈ సందేశం చూడగానే బాబా నాకు దేని గురించో ముందే సన్నద్ధం చేస్తున్నారేమో అని అనిపించింది. నేను అలా భావించినట్లుగానే మా అమ్మాయి ఈరోజు ఒక కొత్త ప్రస్తావన తీసుకొచ్చింది. మా తల్లిదండ్రులతో మాట్లాడుతూ, మా తల్లిదండ్రుల తదనంతరం వారి కూతురయిన నాకు మా తల్లిదండ్రులు ఇవ్వాలనుకుంటున్న ఆస్తి (వ్యవసాయ భూమి )లో భాగం తనకి ఇస్తే బాగుంటుందని, అమ్మ కే (నాకు )ఇచ్చేస్తే,ఆస్తి ని బాబా గుడికి ఖర్చు పెడుతుంది , అలా కాకుండా తనకి ఇస్తే తన అత్తగారి సూటి పోటి మాటలు తప్పుతాయేమో” అని మాట్లాడింది.. ఇది వినగానే నా మనసు కొద్దిగా కలత చెందింది. ఎందుకంటే గతంలోనూ నాకు ఇవ్వాలనుకున్న ఆస్తిని మా అమ్మాయి కి తన వివాహం సందర్బంగా ఇచ్చి వేయడం జరిగింది. అయినప్పటికీ,.సాయి దయతో ఈ ఉదయం ముందే సూచించిన సందేశాన్ని గుర్తు తెచ్చుకొని మనసుని సిద్ధం చేసుకున్నాను. నిజమే కదా ఈ ఆస్తులు ఇవన్నీ నేను చనిపోయాక వ్యర్థమే కదా. ఈ జీవితాన్ని సౌకర్యవంతంగా బతికేలా దేనికి లోటు లేకుండా ఉంటే చాలు కదా, ఆస్తి కోసం తాపత్రయము ఎందుకు నాకు అని అనిపించింది. సరే వారు వారికి ఇష్టమైనట్టుగా వారి ఆస్తిని వారి తదనంతరం వారి ఇష్ట ప్రకారం ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. నాకు అసలు ఏమి ఇవ్వకపోయినా,నేను ఈ విషయంలో ఏమి పట్టించుకోవద్దు అని అనుకున్నాను. మనతో పాటు ఈ ఆస్తులు ఇవేవీ రావు కదా మనం చేసిన మంచి చెడుల కర్మ ఫలితాలు మాత్రం మనతో తప్పకుండా వస్తాయి అని అంటారు కదా సాయి, ఆ విధంగా జీవితం గడపాలి అనిపించింది.
మా అమ్మాయి ఈరోజు చేసే ప్రస్తావని ముందుగానే గ్రహించిన సాయి దేవుడు ఈ ఉదయమే నాకు తన సందేశం ద్వారా నా మనసుని సిద్ధపరచాడు. అలా ఆ విషయం గురించి కలత చెందకుండా నన్ను దయతో కాపాడారు.అవసరానికి మించిన ఆస్తి పాస్తులు వ్యర్థం అనుకునే ప్రేరణ ని ఈ సందేశం ద్వారా సాయి నాకు అందించారు.ఎపుడూ తరిగిపోని సాయిప్రేమ అనే ఆస్తి ని పొందడానికే మనం తపన పడాలి, సాయి ప్రేమ పొందడానికి సాయి నచ్చేలా మనల్ని మనం సరిదిద్దుకోవాలి. సాయి బోధన లని పాటిస్తున్నామా లేదా అనేది ప్రతి రోజు మనల్ని మనం తరచి చూసుకోవాలి.ఇంత మంచి ప్రేరణ అందించిన సాయి నాధా, నీకు జయము జయము..
“హే సాయినాథా! ఈ విధంగా ఎల్లప్పుడూ నన్ను కనిపెట్టుకుని వుండు తండ్రీ!! ఈర్ష్య స్వార్ధ ద్వేషాలతో కూడి, అడుగడుగునా సంకటాలతో నిండిన ఈ భవ సాగరాన్ని నువ్వే దయ తో నా వెంట ఉండి దాటించు తండ్రి!”
