
ఓం శ్రీ సాయినాధాయ నమః
శ్రీమతి రేపాక సీతామహాలక్ష్మి గారు అమలాపురం వాస్తవ్యులు. వారు తమ సాయి అనుభవం ఇలా పంచుకున్నారు.
” ఆరోజు మా అమ్మాయికి పురిటి నొప్పులు వస్తున్నాయి.ఆస్పత్రిలో చేర్పించాము. శ్రీ సద్గురు సాయి విభూతిని పెట్టి డెలివరీ రూములో చేర్చాము. ఆరోజు మరొక విశేషం శ్రీ సాయినాధులకు ప్రీతికరమైన గురువారం కూడా అవడం వలన మేమంతా సంతోషించాము.గురువారం సాయంత్రం 5గంటలకు ఆసుపత్రిలో చేర్చాము.శుక్రవారం ఉదయం 5:25 నిమిషాలకు సుఖంగా పురుడు వచ్చింది. శుక్రవారం ఆడపిల్ల పుట్టింది,మహాలక్ష్మి అని ఎంతో సంతోషించాము.ఆ సంతోషం ఎంతోసేపు నిలబడలేదు. పాప ఆరోగ్యం సరిగా లేదని డాక్టర్లు చెప్పడంతో నా నవనాడులు కృంగిపోయాయి.సాయినాధ ఇదేనా నీ కరుణ! పాపకు ఆరోగ్యం ఇవ్వు.పాపను బ్రతికించు, తల్లి పిల్ల సుఖంగా కులాసాగా ఉంటేనే కదా పెద్దవాళ్ళం మాకు ఆనందం. వారిని కరుణించు అని దీనాతి దీనంగా మనసు విప్పి చెప్పుకుని మరి విలపించాను. నెలరోజులైంది అయినా పాప కోలుకో లేదు. ఏం చేయాలి తండ్రి నువ్వే నాకు దిక్కు. ఈ గండం నుండి గట్టెక్కించు అని తలరాతలు కూడా మార్చగల ఆ తండ్రిని ప్రతిక్షణం ప్రార్థిస్తున్నాను. అదే సమయంలో మా ఊళ్లో శ్రీ సాయి భక్తులైన వాడ్రేవు శ్రీనివాసరావు గారి ఇంటికి వెళ్లి జరిగినదంతా చెప్పి బోరు పని వినిపించాను. ఆ సమయంలో శ్రీనివాస రావు గారి భార్య బాబా విభూతిని ఇచ్చి పాప కు కులాసాగా ఉంటుంది,కంగారు పడొద్దు అని చెప్పారు. ఆ విభూతి తీసుకున్నాము,పాపకి ఇచ్చాము.ఆమె చెప్పినట్టే పాప కోరుకుంది.ఆమె ఆరోగ్యం బాగా అయింది. ఇప్పుడు తల్లి పిల్ల క్షేమంగా ఉన్నారు . పాప ఈనాడు ఆరోగ్యంగా ఉన్నదంటే అది శ్రీ సద్గురు సాయి చలువ. వారి విభూతి మనసారా నీవే దిక్కని నమ్ముకున్న వారిని ఆ తండ్రి తప్పక కాపాడుతాడు అనడానికి మా పాప, మా బాధే నిదర్శనం. ఆనాటి నుంచి శ్రీ సాయిబాబా పై అపరిమిత విశ్వాసం మాకు కలిగింది. భక్తజన బాంధవుడైన శ్రీ సాయినాథ మహారాజు ఏ క్షణం నుంచి మాకు రక్షకుడిగా వచ్చారో ఆ క్షణం నుండి మేము ఆ మహారాజుకు శరణాగతము దాసాలు దాసులము అయ్యాము.శ్రీ సద్గురు సాయినాధుడికి ఏమిచ్చినా తీసుకోలేని రుణగ్రస్తులము మేము. ఓం శ్రీ సాయిరాం “
source : శ్రీ ఓరుగంటి రామకృష్ణ ప్రసాద్ గారి “సద్గురు సాయి భక్త లీలామృతం “
