ఓం శ్రీ సాయినాథాయ నమః

ఇతరుల శ్రేయస్సు ని మనం కోరుకుంటే ఆ సద్భావన ఫలితం గా వెంటనే సాయి మనకు తన అనుగ్రహ వరాలని కురిపిస్తాడు .. సద్భావనలు, సత్ సంకల్పాలు ఎల్లప్పుడూ శుభ ఫలితాలని అందిస్తాయి అనే విషయం నిరూపించే సాయి లీల మీతో పంచుకుంటున్నాను.
జూన్ 12. “సాయి మహారాజ్ సన్నిధి ” అనే బ్లాగ్ని ర్వాహకుల పుట్టిన రోజు న వారికి నేను శుభాకాంక్షలు తెలుపుతూ సందేశం పంపడం జరిగింది. వారు నాతో కాంటాక్టులో ఉండటం కానీ, మెసేజెస్ కి స్పందించడం కానీ ఏమి చేయకపోయినా వారి పుట్టినరోజు సాయి వారికి శ్రేయస్సు కల్గించాలనే ఒక మంచి భావన తో ఆ సందేశం పంపడం జరిగింది..ఆ సందేశం లో సాయి ప్రేరణ గా , ” సాయినాధుడి కృప తో మీరు భౌతిక విషయాల్లో మరియు ఆధాత్మికంగా ఇంకా ఉన్నత స్థాయికి చేరాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ” అని సందేశం పంపడం జరిగింది. సందేశం పంపిన రోజే సాయి నా జీవితం లో ఒక గొప్ప ఆధ్యాత్మిక మలుపు కి శ్రీకారం చుట్టాడు.ఆ రోజు ని నేను ఎప్పుడూ మరచిపోలేను. వారికి శుభాకాంక్షలు చెప్పిన వెంటనే సుమారు 10 నిమిషాల్లోనే,నాకు నేను అనుసరిస్తున్న మా పూజ్య గురుదేవులు శ్రీ అమ్ముల సాంబశివరావు గారి సంస్థ తరపు వారు call చేయడం జరిగింది. ఈ సంవత్సరం “సాయి సేవక్ ” జీవితకాలపు దీక్ష కి గాను అప్లై చేసుకొమ్మని సూచించడం జరిగింది.ఇంత కాలం లేనిది అదే రోజు అప్పుడే నాకు ఈ అవకాశం తలుపు తట్టడం ఆశ్చర్యానందాలను కలిగించింది. ఇక్కడ ఒక విషయం వివరించాలి.. నేను గత 14 సంవత్సరాల నుండి సాయి సేవక్ దీక్ష తీసుకోవడం గూర్చి చాలా తపన పడుతూ ఉండేదాన్ని. పలు మార్లు మా గురువు గారిని దీక్ష కి అనుమతించమని అడిగినా నాకు యోగ్యత లేనందుకో, మా తల్లిదండ్రుల అనుమతి నాకు లభించని కారణం వల్లో మరి దేనికో గానీ “చూద్దాం లే ” అని గురువుగారు సమాధానం ఇచ్చేవారు.సాయి సేవక్ దీక్ష అంటే మన జీవితం లో మనకి అవసరం అయిన వృత్తి ఉద్యోగ వ్యాపారాలు నిర్వహించుకుంటూనే, మిగిలిన సమయాన్ని సాయి సేవ లో ఉపయోగించడం.అంటే సాయి పరమయిన పలు కార్యక్రమాల ద్వారా ప్రజల్లో సాయి భక్తి ని పెంచుతూ, సాయి ప్రచారం చేస్తూ సాయి తత్వాన్ని బోధనలను సమాజం లో వ్యాపింపచేసి సత్య ధర్మ న్యాయాలని స్థాపించడం అనే లక్ష్యం తో సాయి సేవక వ్యవస్థ ని గురుదేవులు ఏర్పాటు చేశారు. పూజ్య గురుదేవుల దగ్గర సాయి సేవక్ దీక్ష తీసుకున్నవారు గురుగారి దగ్గర సాధనాలయం లో సాధన లో పాల్గొంటూ, అన్నివిధాలా సంస్కరించబడుతూ, ఆధ్యాత్మికం గా తాము ఎదుగుతూ తమతో పాటు సమాజాన్ని కూడా ఆధ్యాత్మిక మార్గం లోకి మళ్లీస్తారు.ఇది ఒక మహత్కార్యం .ఇంతటి ఆధ్యాత్మిక ఫలాన్నిచ్చే సాయి సేవక్ దీక్ష తీసుకొని నా జీవితం గురుగారి సాయిమార్గం లో గడుపుతూ జీవితాన్ని ధన్యం చేసుకోవాలి అని నేను ఆశిస్తూ ఉండేదాన్ని. కానీ దీక్ష నియమం ప్రకారం, దీక్ష తీసుకోవాలి అంటే తల్లి దండ్రుల అనుమతి తప్పనిసరి. దానికి మా తల్లిదండ్రులు అనుమతి ఇవ్వలేదు దీక్ష తీసుకుని నేను సన్యాసిని గా మారిపోతానేమో అని వారి భయం. మొత్తానికి దీక్ష నేను తీసుకోకుండానే ఇలా సంవత్సరాలు గడిచి పోతున్నాయి అని బాధ పడి నేను కూడా దీక్ష విషయం దాదాపు మర్చిపోయాను. అలాంటి స్థితి లో ఇన్ని సంవత్సరాలు లేనిది ఆ రోజు జూన్ 12 నాడు నన్ను దీక్ష కి అప్లై చేసుకోమ్మని సాయి అనుగ్రహం తో పిలుపు రావడం నాకెంత సంతోషం కలిగించిందో చెప్పలేను. కానీ మరో వైపు దీక్ష కి మా తల్లిదండ్రులు ఈసారి అయినా అనుమతి ఇస్తారో లేదో అనే భయం మొదలయ్యింది.ఈ విషయం గూర్చి సాయి ని తీవ్రంగా ప్రార్థించుకున్నాను వారు అనుమతించాలి అని. వారి మనసుల్ని సాయి ఎలా మార్చాడో ఏమో కానీ ఆశ్చర్యం గా వారు ఒప్పుకోవడం జరిగింది.ఆ తరువాత సేవక్ దీక్ష కి అప్లై చేసుకోవడం, పూజ్య గురుదేవులు sevaks ఎంపిక గూర్చి చేసే ఇంటర్వ్యూ కి హాజరు అవడం చివరికి నేను సాయి సేవక్ దీక్ష కి సెలెక్ట్ అవడం జరిగింది. ఇక్కడ నాకు అనిపించిన విషయం, ఒకరి గూర్చి మనస్ఫూర్తిగా వారి భౌతిక ఆధ్యాత్మిక ఉన్నతి గూర్చి కాంక్షించినపుడు నా సద్భావన ఫలితం గా సాయి నన్నూ అనుగ్రహిస్తూ “మరి నీ ఆధ్యాత్మిక ఉన్నతి మాటేంటి ?” అంటూ ఆధ్యాత్మిక ఉన్నతికి బీజం వేశాడు. వారి పుట్టినరోజు నాడు శుభాకాంక్షలు అందించడం తో మొదలయిన ఈ శుభ ప్రహసనం నా పుట్టినరోజు అక్టోబర్ 10 నాడు సాయి సేవక్ దీక్ష క్లాసులకి గాను గురుదేవుల సాయిసేవాశ్రమం కి ప్రయాణం అయ్యేలా చేస్తోంది.
హే సాయిదేవా 🙏.. ఓ గురుదేవా!!నా శేష జీవితం నీ సేవ లో పూర్తిగా తరించేలా అనుగ్రహం కురిపించమని మీ పాదములంటి ప్రార్థిస్తున్నాను.
