శ్రీ సాయి నాధాయనమః !
కొత్త గా వివాహం చేసుకున్న ఒక సాయి భక్తుడి భార్య ని , శ్రీ సాయిబాబా తన కృపతో ఆమె ని తన భక్తురాలిగా మార్చిన వైనం చూడండి …..
ఢీల్లీ లోని ‘అమిత్ అనే సాయి యొక్క పరమ భక్తుడు, కొత్త గా పెళ్లయి , తన భార్య తో షిరిడి వెళదామని టికెట్స్ బుక్ చేసుకుంటాడు. కానీ తన భార్య అతని తో, “కొత్త గా పెళ్లయిన దంపతులు న్యూజిలాండ్ కో, మారిషస్ కో వెళ్తారు , కానీ షిరిడీ వెళ్లాలనుకునే , మీ లాంటి మూర్ఖులని చూడలేదు” అని గొడవ పడుతుంది.. బాబా పట్ల భక్తి విశ్వాసాలు లేని మహిళను తాను భార్య గా పొందానని తెల్సుకుని అతడు చాలా బాధ పడతాడు . తర్వాత పాపం ఆ భక్తుడు ఎలాగోలా తన భార్య ని ఒప్పించి తనని షిరిడి లో బాబా దర్శనానికి అని తీసుకెళతాడు, “మనసు లేనిదే పంచ భక్ష్య పరమాన్నమయినా రుచించదు” అన్న చందాన ,ఆమె షిరిడి చేరిన నుండీ , ముభావం గా అయిష్టం గా ప్రవర్తించసాగింది . “మన భావాలకు అనుగుణమయిన వాటినే మనం పొందెదము” అన్న విషయాన్నీ నిజం చేస్తూ, చిర చిర లాడుతున్న ఆమె ప్రవర్తనకి తగ్గట్టు గానే తన మనీ పర్సు ఎక్కడో పోగొట్టుకుంది. ఈ విషయం గమనించిన తరవాత ఆవిడ మళ్ళీ తన భర్త ని సాధించసాగింది .”మీ బాబా అందరికీ భాగ్య విధాత అంటారు కదా, కానీ మీ సాయి బాబా దగ్గరికి వస్తే ,నా డబ్బులు పోగొట్టాడు, అలాంటి మీ బాబా భాగ్య విధాత ఎలా అవుతాడు?” అని వాదించ సాగింది.
తాను నమ్ముకున్న తన సాయి దైవం గూర్చి ఆమె అలా మాట్లాడ్డం భరించలేక అతని కళ్ళు బాధ తో వర్షించసాగాయి, వెంటనే, సమాధి మందిరం లో బాబా తో ఆయన , ” బాబా నీవే నా జీవన నౌక కి చుక్కానివి, నన్ను పాలించే నా దేవుడివి నీవే, ఇది నిజమే అయితే, నా భార్య కి నువ్వెవరో తెలియ చేసి తనని నీ భక్తురాలిగా మార్చుము, భక్తుల మొర విని వారిని ఉద్ధరించడాని కి పరుగున వస్తావు, వెంటనే నీ లీల చూయించి ఆమె కి నీ ప్రేమ, నీ శక్తి ఏంటో తెలియజేయుము” అని వేడుకుంటాడు.
సమాధి మందిరం నుండి బయటకి రాగానే, ఎక్కడి నుండో ఒక పిల్లవాడు పరుగున వారి దగ్గరకి వచ్చి ఆ భక్తుడి చేతిలో వారి పర్సు పెట్టి పరిగెత్తుతుంటాడు. వారు ఆశ్చర్యం తో, పరిగెడుతున్న ఆ బాలుడిని పట్టుకుని , ఈ పర్సు ఎవరిచ్చారు ? అని వివరాలు అడగ్గా, ఆ బాలుడు, మీరు ఆ దుకాణం లో వస్తువులు కొంటూ అక్కడే పర్సు పెట్టి మరిచి పోయారు కదా, ఆ దుకాణం యజమాని దీన్ని మీకు ఇవ్వమన్నాడు అని చెప్తాడు. వారు తమ పర్సు దొరికినందుకు ఆనంద పడి, ఆ దుకాణదారుడికి కృతజ్ఞతలు చెప్పుకుందామని ఆ దుకాణం కి వెళ్తారు . కానీ ఆశ్చర్యం! ఆ దుకాణాదారుడు వీళ్ళని గుర్తించక,” అసలు మీరెవరు? నేను ఎవరితోనూ పర్సు ఇచ్చి పంపలేదు” అని అంటాడు . అపుడు ఆ భక్తుడి కి , ఆ బాలుడు ఎవరో కాదు, బాబా నే తన ఆవేదన గ్రహించి బాలుడి రూపం లో వచ్చి తమకు లీల చూయించారని అర్థం అవుతుంది,
ఇదే విషయాన్ని తన భార్య తో ,. ” నా సాయి భాగ్యములని ప్రసాదించే భాగ్య విధాత , తన భక్తుల కష్టాలను సహించలేక తానే వాటిని భరించి , తన వారిని కష్టాలనుండి విముక్తుల్ని చేసే ఆపద్భాంధవుడు, ప్రేమ స్వరూపుడు, పిలిచినా వెంటనే పలుకుతాడు ” అని వివరిస్తాడు. జరిగినదంతా తన కళ్లారా చూసిన అతని భార్య కి ఆ రోజాటి నుండి సాయి నాధుని పై భక్తి విశ్వాసాలు కలుగుతాయి .
ఈ విధం గా బాబా చూపిన ఈ లీల తో ,ఆమె కూడా సాయి భక్తురాలయ్యి వారిద్దరూ సాయి సేవ లో తరిస్తున్నారు.
ప్రేమ స్వరూపా -సాయి శరణం !