
ఓం శ్రీ సాయి నాధాయ నమః
సాయి కి అంకిత భక్తుడు కాకినాడ వాస్తవ్యుడు శ్రీ పేరూరి శర్మ గారి కి సాయి ఎన్నో లీలలని చూయించారు. వారి కుమారుడు తన తండ్రి కి సాయి చూయించిన ఒక లీల ని ఇలా వివరించారు..
” బాబా మహాసమాధి చెందిన 40 సంవత్సరాల తర్వాత జరిగిన ఒక సాయి లీల మీతో పంచుకుంటున్నాను .సుమారు 1958 వ సంవత్సరం జనవరిలో మా నాన్నగారు శ్రీ పేరూరు శర్మగారు బాబాతో ఒక గొప్ప అనుభవాన్ని పొందారు..ఈ సాయి లీలకి నేను సాక్షిగా ఉన్నాను.
సాయి దేవుడు తను ఇచ్చిన మాట తప్పకుండా నిలబెట్టుకుంటాడు. హేమంత్ అంటే ఇంటికి భోజనానికి వస్తానని మాట ఇచ్చి, పటము రూపంలో వారింటికి వెళ్లి భోజనాన్ని స్వీకరించారు. అలాగే సాయి అద్భుతమైన లీల మాకు చూయించి మమ్మల్ని అనుగ్రహించారు. ఆగస్టు 1957 లొ కాకినాడ పట్టణంలో నివాసం ఉండేవాళ్ళం. మా అన్నయ్యని ఒకసారి ప్రాణహాని నుండి సాయిబాబా తన అద్భుతమైన లీల చూయించి రక్షించాడు.అప్పటినుండి మా తండ్రి సాయి బాబాకి అంకిత భక్తుడయ్యాడు. 1957 చివరన మేము ఒక కొత్త ఇంటికి ఇల్లు మారాం. ఒకరోజు( జనవరి 1958 )మా నాన్నగారు మమ్మల్ని పిలిచి ఈ విధంగా చెప్పారు “నాకు బాబా కలలో దర్శనం ఇచ్చారు.కలలో నేను వారిని మన ఇంటికి భోజనానికి ఆహ్వానించాను.నా ఆహ్వానం బాబా మన్నించారు కాబట్టి తప్పకుండా ఈరోజు బాబా గారు మన ఇంటికి భోజనానికి వస్తారు ” ఇలా చెప్పి మ నాన్న ఆ ఏర్పాట్లలో మునిగిపోయారు. అప్పుడు నా వయసు కేవలం ఆరు సంవత్సరాలు.మాకు బాబా గురించి పరిజ్ఞానం లేకపోవడం వల్ల బాబా అప్పటికీ సమాధి చెందారు అనే విషయం మాకు తెలియదు. మేమందరము బాబా ఆరోజు మా ఇంటికి వస్తున్నారనే ఆశించాము. మిట్ట మధ్యాహ్నం వరకి చూసాము కానీ బాబా మా ఇంటికి రాలేదు. మేము అందరం చాలా ఆకలిగా ఉండటం వలన మా నాన్నగారిని బాబా ఇంకెప్పుడు వస్తారు మనమందరం కలిసి ఎప్పుడు భోజనం చేస్తాము? అని అడుగుతూ విసిగించాము. మా నాన్నగారు బాబా కోసం ఇంటి గుమ్మం వద్ద పచార్లు చేస్తూ ఉన్నారు. ఎంత సేపు వేచి చూసినా కూడా బాబా రాలేదు, కానీ మా మేనమామ ఒక సైకిల్ మీద మా ఇంటి గుమ్మం వద్ద కి వచ్చి,మా ఇంట్లోకి ప్రవేశించాడు.ఇంట్లో బాబా గురించి చేసిన ప్రత్యేకమైన భోజనము స్వీట్స్, పులిహోర అన్నం అవన్నీ చూసి ఆరోజు ఇంట్లో ఏదైనా ప్రత్యేకత ఉందా అని మా నాన్నని అడిగాడు. మా నాన్నగారు ఆయనతో, బాబా భోజనానికి ఇంటికి వస్తున్నారని మాట ఇచ్చారని చెప్పారు.దాంతో మా మేనమామ నవ్వుతూ “బాబా మన ఇంటికి భోజనానికి వస్తారా,బాబా రారు చూడు. ఈ ప్రత్యేకమైన భోజనం స్వీట్స్ ఇవన్నీ నేను స్వీకరిస్తాను.నువ్వు బాబా స్వీకరించినట్టుగా భావించి సంతృప్తి చెందవచ్చు. నేను ఇప్పుడే కోనసీమ నుంచి వచ్చే బస్సు దిగాను. కోటిపల్లి దాకా పడవపై వచ్చాను.అక్కడ మా సొంత ఊరు నుంచి సైకిల్ తీసుకొని ఇలా వచ్చాను ” అని చెప్పుకొచ్చారు. మా మేనమామ గారు చెప్పినట్టుగానే వారు మూడు రోజుల క్రితం కోనసీమకి ప్రయాణమై తిరిగి కాకినాడ కి వచ్చినట్టు వారి ముఖం పైన గల గడ్డా న్ని చూసి మేము భావించాము. మరియు వారి దగ్గర సొంత సైకిల్ లేదన్న సంగతి మాకు తెలుసు కాబట్టి మాకు ఎక్కడ అనుమానం రాలేదు. అక్కడ దారిలోని వారి సొంత ఊరి నుంచి సైకిల్ తీసుకొచ్చినట్టు మేము అర్థం చేసుకున్నాం. మేమందరము మా మేనమామ గారితో కలిసి భోజనాన్ని పూర్తి చేసాము మా అమ్మ కూడా తన తమ్ముడు ఈ ప్రత్యేకమైన భోజనాన్ని స్వీకరించినందుకు ఆనంద పడింది.
భోజనాలు అయ్యాక మా మేనమామ మా నాన్నగారిని,భోజనాలయ్యాక బ్రాహ్మణుడికి రెండు రూపాయలు ఇచ్చినట్టుగా రెండు రూపాయల దక్షిణ తనకి ఇమ్మని అడిగారు. మా నాన్నగారు రెండు రూపాయల దక్షిణ మా మేనమామకిస్తూ చమత్కారంగా,”తీసుకో ఈ రెండు రూపాయలు!!నీ సిగరెట్లకి ఖర్చు పెట్టుకో “అని అన్నారు. తరువాత మేనమామ తన సైకిల్ మీద సుమారు రెండు కిలోమీటర్ల దూరంలోని తన ఇంటికి బయలుదేరారు. మా నాన్న అతనికి వీడ్కోలు పలుకుతూ సాయంత్రం వారి ఇంటికి వచ్చి ఫోటో స్టూడియోలో కలుస్తాను అని చెప్పాడు. మా మేనమామ గారి ఇల్లు మరియు వారి ఫోటో స్టూడియో రెండుపక్క పక్కనే ఉంటాయి. మా తాతగారు, ఆ ఫోటో స్టూడియో” భీమేశ్వర ఎలక్ట్రానిక్స్ ” అధినేత. వారు కూడా అక్కడే ఉంటారు. నేను మా నాన్నగారితో కలిసి సాయంత్రం ఆ ఫోటో స్టూడియో కి వెళ్ళాను. మేము వెళ్లేసరికి స్టూడియోలో మా మేనమామ గారు ఒక ఫోటో యొక్క నెగెటివ్ ప్రింట్ చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. అక్కడ మా మేనమామ ని చూసి మేము ఆశ్చర్యపోయాం. మా మేనమామ చాలా నున్నటి గడ్డంతో ఉన్నారు. మా నాన్నగారు ఆశ్చర్యంగా వారితో, “అరె మధ్యాహ్నం భోజనం తర్వాత గడ్డం ఎలా తీసుకున్నావు? మన బ్రాహ్మణుల ఆచారాలకి గుడ్ బై చెప్పావా? ” అని అడిగారు. దాన్ని మా మేనమామ ఖండిస్తూ తాను ఆ రోజుటి ఉదయమే గడ్డం తీసుకున్నానని చెప్పారు. మా నాన్నగారు అసలు నమ్మలేక అలాగే స్తబ్దంగా నిల్చుండిపోయారు. ఎందుకంటే మధ్యాహ్నం మా ఇంటికి వచ్చిన మా మేనమామ మొహానికి గడ్డం ఉంది.మా నాన్న తేరుకుని, మా మేనమామతో తాను సైకిల్ తీసుకొని మధ్యాహ్నం మా ఇంటికి రాలేదా అని అడగ్గా, “లేదు” అని వారు సమాధానం చెప్పారు వెంటనే మా నాన్నగారికి బాబా లీల అర్థం అయింది. అంటే ఆరోజు మధ్యాహ్నం మా ఇంటికి వచ్చి భోజనపదార్థాలని చూసి మెచ్చుకుని మాతోపాటు సంతృప్తిగా భోజనం చేసింది సాయినాథుడే అని తెలుసుకుని మా నాన్నగారు ఆనందంతో భావోద్వేగ స్థితిలోకి వెళ్ళిపోయారు . మా నాన్నగారు వణుకుతూ చిన్నగా ఏడుస్తూ.. ” హే సాయి దేవా. నువ్వు వచ్చావు అయినా నేను నిన్ను గుర్తించలేకపోయాను. నువ్వు నన్ను రెండు రూపాయల దక్షిణ అడుగుతూ వచ్చింది నువ్వేనన్న సంకేతం ఇచ్చావు . అయినా నేను నిన్ను గుర్తించలేదు,నీ పాదాలకు మొక్కలేదు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాతనే గానీ నాకు ఇంటికి వచ్చింది నువ్వే అన్న సంగతి అర్థం కాలేదు “అని అని బాధ పడసాగారు. అక్కడ వాళ్ళందరూ జరిగిన విషయం తెలుసుకొని మా నాన్నగారిని చాలా అదృష్టవంతుడని పొగిడారు. సాయినాధులతో కలిసి మేమందరము భోజనం చేసిన మా అదృష్టాన్ని తలుచుకొని మురిసిపోయాము.
సాయి మాటలు పొల్లు పోవు. బాబా చెప్పినవి అక్షరాలా జరగవలసినదే.వారు కల లొ ఏదయినా చెపితే, అది అవుతుందా అని సందేహం పెట్టుకోవద్దు. సహనం తో వేచి చూస్తే, బాబా చెప్పింది జరుగుతుండటం మనమే చూస్తాము.”
శ్రీ పేరూరు శర్మ గారి ఇంటికి భోజనానికి వచ్చి వారిని ఆశీర్వదించినట్లుగా మనందరిని కూడా అనుగ్రహించమని సాయి ని వేడుకుందాము.
ఓం శ్రీ సాయినాథాయ నమః
సాయి బంధువులకి మనవి. మీ అనుభవాలని సాయి భక్తులతో పంచుకోడానికి పేపర్ పైన అనుభవం రాసి తీసిన ఫోటో /వాట్సాప్ వాయిస్ మెసేజ్ /text మెసేజ్ రూపం లొ మాకు 7995901703 నెంబర్ కి పంపగలరు .
